మాతృ గర్భంలో నవమాసాలు కటిక చీకటిలో అండము నుంచి పిండంగా పెరిగింది.
ఎన్ని సార్లు మోసిన కడుపును తన్నిందో, తాను ఎంత
యాతన అనుభవించిందో, ఎంత బాధను
మోసిన వారికి కలిగించిందో !!!
వెలుగు చూసింది,
బాల్యం నాటినుంచి ఏవో ఆశలు,ఏవో కోరికలు,ఏవో ఆలోచనలు.
కోరినవి తీరితే కేరింతలు,
తీరనపుడు గుక్క తిరగని ఏడుపులు.
ఎందరు గారం చేసారో,ఎందరు ముద్దు చేసారో,
ఎందరు ప్రేమను పంచారో,ఎందరి పొత్తిళ్ళలో పెరిగానో
ఎందరి భుజాలపై ఎక్కానో ఏవీ గుర్తు లేవు!!!
అడుగులు తడబడి కింద బడిన సందర్భాలు ఎన్నో
ఒక అడుగు అమ్మ, ఒక అడుగు నాన్న,
చేయి పట్టి నడిపితే ఈ లోకాన్నే జయించినంత అనందం.
ఆటలలో అన్న, పాటలలో అక్క,
చేదోడు వాదోడుగా తమ్ముడు,
అల్లరి పట్టించటానికి చెల్లి,
చిన్న చిన్న బహుమానాలు ఇచ్చే బంధువులు
గురుతు ఉండి లేనట్లుగా గడిచిపోయింది!!!
అలుపెరగని ఆటలతో కౌమారం మొదలైంది.
పగలేదో రాత్రేదో తెలియదు.
అంతులేని ఆటలు,పొంతనలేని చేతలు,
చదువుకోసం నిదురలేని రాత్రులు,
స్నేహం కోసం త్యాగం చేసిన సాయంత్రాలు.
బతుకు బాటకోసం వెతుకులాట.
ఆశలు ఎన్నో, ఆశయాలు ఎన్నో,
సాధించాలనే తపన ఎంతో.
అంతులేని ఆలోచనలను, అదుపులేని ఆవేశాన్ని
అర్ధంకాని భవిత, అర్ధంతరంగా వచ్చిన బాధ్యతలు
కమ్మేశాయి!!!
ఎన్నో కలలు, ఎన్నో రంగులు
కలలకు వాస్తవాన్ని పరిచయం చేసే జీవితం ఆరంభం,
ఆవేశానికి అనుభవం నేర్పించిన పాఠాలు కొన్ని, గుణపాఠాలు కొన్ని.
మోయలేని భారమైన మోయాయవలసిన బాధ్యతలతో
రక్తాన్ని చెమటని, కన్నీటి తెరలుగా మర్చి
కనురెప్పల మాటున దాచి
చిరునవ్వులుగా మలచి
కొండంత భారాన్ని పిడికెడు గుండెలో దాచుకొని,
పడుతూ లేస్తూ సాగిన జీవన పయనం
ఏ చిత్రంలోనూ చూపలేని సన్నివేశాలతో
ఏ నాటకంలోని ఊహించలేని మలుపులతో
సాగిన జీవన పోరాటంలో శక్తి యుక్తులు ఉడిగి
వయో భారంతో మరొకరి సేవలు చేయించుకోవటం
బాధాకరంగా పరిణమించి నా అనుకున్న వారు
పరాయివారుగా మారితే అక్కున చేర్చుకున్న అందరు
అందనంత దూరంలో ఉంచితే
కన్న వారి పలకరింపులు మాయమైతే
ఎన్నో జ్ఞాపకాలను,ఎన్నో అనుభవాలను
ఎన్నో ఆక్రోశాలను,ఎన్నో ఆవేదనలను భరించిన
గుండె ఆగింది,ఈ లోకం వదిలి,బూడిదని మిగిల్చింది.
మళ్ళీ మనిషి జన్మ వద్దని ఆ మహాదేవుని పాదాలను కన్నీటితో అభిషేకిద్దామని తనువు విడిచి వెల్లింది
బంధాలకు అనుబంధాలకు పిలుపులకు తలపులు
అందనంత దూరంగా!!!!!
Comments
Post a Comment